Sunday, October 16, 2022

ఉక్రెయిన్ యుద్ధం - దాని ప్రభావాలు - క్లుప్తంగా .. నా ఆలోచన


మనలో చాలా మంది ఉక్రెయిన్  యుద్ధం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల  దూరంలో ఉంది కాబట్టి , ఆ యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉండదు అనే అభిప్రాయం లో ఉన్నారు.. 

టీవీల వ్యాఖ్యాతలు యుద్దాన్ని ఒక నాటకీయంగా, థ్రిల్లర్  సినిమాలో లాగా  చూపించడంతో మనకు ఎక్కువ వినోదభరితమే కనపడుతోంది  ఈ యుద్ధం  వల్ల మనందరి జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని తెలిపేటందుకు  తక్కువ సమయం కేటాయిస్తున్నాయి.   ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ పఠాన్ని, ప్రపంచ గమనాన్ని,  దేశాల ఆలోచనా  విధానాల్ని మార్చబోతోంది అనేది నా అభిప్రాయం.


మొదటిది: అణ్వాయుధాలు మరియు ఆయుధ సంపత్తి 

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత,  ప్రపంచంలో  రష్యా మరియు అమెరికా తరువాత   ఎక్కువ అణ్వాయుధాలు కలిగిన  దేశం  ఉక్రెయిన్  ఒకటి.  

ఆ తర్వాత,  కొన్ని పెద్ద దేశాలు అన్నీ  కలిసి...  అణ్వస్త్ర రహిత ఒప్పందం ( NPT )   కోసం ,  అన్నీ కలిసి హంగేరి ఒప్పందం ప్రకారం ఉన్న అణ్వాయుధాలన్నీ వదిలేసింది.   ఇంతవరకూ జరిగింది ఒక కథ.  ఆ తరువాత ప్రపంచ దేశాలు  అణ్వస్త్రరహితం గురించి దీర్ఘాలోచనలు చేశాయి.  ఈ అణ్వాయుధాల సంఖ్య ఎలా తగ్గించాలో అని మేథోమథనం జరిపాయి. 

కారణాలు ఏవయినా కానీ,  ఉక్రెయిన్ యుద్ధం  జరగబట్టి ఇప్పటికి మరిన్ని  నెలలు దాటి పోయింది. రష్యా తనకున్న ఆయుధ సంపత్తిని ఉపయోగించి  ఉక్రెయిన్లో  భీభత్సం సృష్టించింది.   అది అందరికీ కనపడుతోంది.  

ఇవన్నీ చూసిన మనకి ఏమని అనిపిస్తుంది,  ఉక్రెయిన్ ఆ ఒప్పందాన్ని గౌరవించకుండా ఉంటె, రష్యా ఈ యుద్ధం చేయగలిగేదా..  

మీకు అనిపించింది కరెక్టే... 
ఈ ఆలోచనలే మరిన్ని దేశాలు చేస్తాయి... చేసి... అణ్వాయుధ సంపత్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే, అణ్వాయుధాలున్న ఏ దేశం మీద అయినా యుద్ధం చేయడం దాని శత్రు దేశాలకు సాహసమే అవుతుంది. 

 

ప్రభావం మరియు ఇతర దేశాల మారే  ధోరణి :

ఈ వచ్చే దశాబ్దాలలో మరిన్ని దేశాలు  అణ్వాయుధ సంపత్తి పెంచుకోవడానికో,  లేదా సైనిక సహకార ఒప్పందం చేసుకోవడమో మనం చూస్తాము..  ఇంతటితో ఆగకుండా.. ప్రతి దేశం తమ సైనిక సంపత్తిని పెంచుకోవడానికి చూస్తాయి.. 

పెద్దన్న లాంటి అమెరికా మాటకు విలువ తగ్గటం , అందరినీ సమన్వయపరిచే ఐక్యరాజ్యసమితి      లాంటి సంస్థల ప్రభావ  పరిమితి తగ్గిస్తుంది.  



డాలర్ మరియు యురొ ఆధిపత్యం :

ఇప్పడున్న ప్రపంచంలో ఎక్కువ శాతం అంతర్జాతీయ లావాదేవీలు అమెరికా డాలరు లేదా యురొ కరెన్సీ (ద్రవ్యం) ద్వారా జరుగుతున్నాయి. 

దాని వల్ల, దేశాలకు ఉన్న FOREX (విదేశీ మారక ద్రవ్యం) నిల్వలు డాలరు లేదా యూరో రూపంలో దాచుకుంటాయి.  

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు కాకముందే రష్యా దగ్గర 600 బిలియన్ (ఒక బిలియన్ అనగా వంద కోట్లు) డాలర్లు ఉండేవి.  అది చాలా పెద్ద  మొత్తం.  ఇంత మొత్తం ఉందనే ధైర్యం కూడా ఒక కారణం రష్యా మొండిగా యుద్ధం మొదలు పెట్టడానికి.  

ఈ యుద్ధం మొదలయిన తర్వాత సంపన్న దేశాలు విధించిన ఆంక్షల వల్ల రష్యా యొక్క విదేశీ మారక ద్రవ్యం  మొత్తం వాడుకోవడానికి లేకుండా అయ్యింది.  ఎందుకంటే, ఇందులో ఎక్కువ శాతం అమెరికా మరియు యూరోప్ బ్యాంకులలో ఉండడం వాళ్ళ వాడుకోవడానికి అందుబాటులో లేకపోవడానికి  కూడా కారణం అయ్యింది. 

ప్రపంచంలో 80 శాతం పైగా అంతర్జాతీయ వాణిజ్యం అమెరికన్ డాలర్, యూరో  మరియు పౌండ్ ద్వారానే జరుగుతోంది. 


ప్రభావం మరియు ఇతర దేశాల మారే  ధోరణి :

 ఇప్పటి నుండి, చాలా దేశాలు  మరీ  ముఖ్యంగా  అభివృద్ధి చెందుతున్న దేశాలు, వారి దేశాల కరెన్సీతో  వ్యాపారం జరపడానికి ప్రతిపాదిస్తాయి.  ఇది అంత సులభం కాక పోయిన, ముఖ్యముగా  చైనా, భారతదేశం, బ్రెజిల్ , మెక్సికో లాంటి దేశాలు ప్రయత్నిస్తాయి. 



SWIFT బ్యాంకింగ్ (అంతర్జాతీయ  కరెన్సీ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ):

మొదట, మనం స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి సంక్షిప్తంగా తేలుకుందాం..  SWIFT ( Society for Worldwide International Financial Telecommunications) . ఈ వ్యవస్థ వాడుకుని 11000 బ్యాంకులు తమ లావాదేవీలను జరుపుకుంటాయి.  ఈ స్విఫ్ట్ వ్యవస్థ, అంతర్జాతీయ బ్రాంకుల వ్యవస్థకి ఉన్న మూల స్థంభాలలో ఇది ఒకటి.  సుమారు 200 దేశాల బ్యాంకులు  ఈ వ్యవస్థను వాడుకుని సంవత్సరానికి లక్ష కోట్ల డాలర్ల దాకా లావాదేవీలు  జరుపుకుంటున్నాయి.

ఈ వ్యవస్థ నుండి ఏదయినా బ్యాంకు లేదా దేశాన్ని బహిష్కరించడం జరిగితే, ఆ దేశ బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకులతో లావాదేవీలు జరుపుకోలేవు. దీని వల్ల , వేరే దేశాల బ్బంకులలో  ఉన్న  డబ్బులు తీసుకోలేవు. రష్యాకు సంబంధించి కొన్ని పేపర్లలో వచ్చిన వార్తల ప్రకారం 600 బిలియన్ డాలర్లు విదేశీ మారక నిల్వలలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు వాడుకోలేని పరిస్థితి ఉంది.  ఒక వేళా వాడుకోవాల్సి వస్తే, స్విఫ్ట్  వ్యవస్థ లేక పోవడం వాళ్ళ, డాకుమెంట్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది

ఇప్పటివరకు, స్విఫ్ట్ వ్యవస్థను ప్రపంచం అంత ఒక ఆర్థిక లావా దేవీల వ్యవస్థలాగా భావించేవారు. ఇప్పడు, ఇది రాజకీయ రంగు పులుముకోవడం వల్ల  ఎన్నో దేశాలు జాగ్రత్త పడడం మొదలు పెడుతాయి. ఇప్పటికే చైనా ,  రష్యా లాంటి దేశాలకు ఇటువంటి అంతర్గత ఆర్ధిక లావాదేవీల వ్యవస్థ ఉంది.. ఇది ఆ దేశంలో ఉన్న బ్యాంకులతో అనుసంధానం అయ్యింది. ఇప్పటికే, భారతదేశం కూడా ఇప్పటికే ఉన్న UPI  వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారానో లేదా ఇప్పటికే ఉన్న వ్యవస్థ ఉన్న దేశాలతో లింక్ ఒప్పందం చేసుకోవడమో జరుగుతుంది. 


ఆర్థిక కూటముల కంటే, సైనిక కూటముల ఏర్పాటుకు సంసిద్ధత:

ఇప్పటి వరకు.. అన్ని దేశాలు ఆర్ధిక కూటమిలలో భాగస్వాములు  అవ్వడానికి ఉత్సాహం  చూపించేవి.  చిన్న, చితక దేశాలు కూడా తమ ఆర్ధిక పరిధిని దాటి వివిధ దేశాలతో, లేదా దేశాల కూటమిలతో  చేరికకు  ఉత్సాహం  చూపించేవి. 

ఉక్రెయిన్ యుద్ధం తరువాత, చిన్న దేశాలు లేదా ఆయుధ సంపత్తి తక్కువ ఉన్న దేశాలు ఒక కూటమిగా ఏర్పడటమో లేదా అప్పటికే ఉన్న సైనిక కూటమిలలో భాగస్వామ్యం అవడానికో ఉన్న ఆలోచనలను తీవ్రతరం చేస్తాయి.  అంతే కాకుండా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని దేశాలు ఏ సైనిక కూటంలో కూడా భాగం కాకుండా తటస్థ వైఖరిని అవలంబించాయి.  ఇక ముందు  తటస్థ  దేశాలుగా ఉండడం తగ్గుతుంది, ఇప్పటికి ఉన్న తటస్థ దేశాలు, తమ భూభాగాన్ని కాపాడుకోవాలనే క్రమంలో  ఎదో ఒక కూటమిలో చేరడానికి ముందుకొస్తాయి. 



విద్యుత్ ఉత్పత్తి:

ఇప్పటి వరకు, కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో, అభివృద్ధి  చెందిన దేశాలు బొగ్గు మీద కాకుండా  గ్యాస్ ఆధారిత విద్యుత్  మీద ఆధార పడేవి. అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యముగా యూరోప్ దేశాలలో గ్యాస్ నిల్వలు చెప్పుకో తగినంతగా  లేవు.  ఉదాహరణకు,  జర్మనీ  సుమారు 50 శాతం గ్యాస్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. 

ఆర్ధిక ఆంక్షల వల్ల , రష్యా  తన కరెన్సీ అయిన రూబుల్స్ లోనే డబ్బులు ఇవ్వాలి అని యూరోప్ దేశాలను అడుగుతోంది. కానీ, యూరోపు  దేశాలు డాలర్ లేదా యురొ మారక ద్రవ్యం లోనే ఇవ్వగలము అని  చెబుతున్నాయి.  ఆంక్షల చట్రంలో ఇరుక్కున్న , రష్యా ఇప్పుడు తన మాట వినని దేశాల మీద ఉక్కు పాదం మోపుతోంది. ఉదాహరణకి,  తన మాట వినని దేశాలు అయిన పోలాండ్,  బల్గెరియా  లాంటి  దేశాలకు  గ్యాస్ పంపించడం ఆపేసింది.  ఈ పరిస్ధితి గమనించి  దేశాలు తమంతకు తామే విద్యుత్ ఎలా ఉత్పత్తి పెంచుకోవాలి ఆలోచిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో, బొగ్గు లేదా అణు ఆధారిత ఉత్పత్తిపై దేశాలు ఉత్సాహం  చూపించే అవకాశం ఉంది. 

ఆయుధ సమీకరణ:

ఉక్రెయిన్ యుద్ధంలో, రష్యా సేనలు సాంప్రదాయక ఆయుధాల ద్వారా అనుకున్నంత పురోగతి సాధించ లేకపోతున్నాయి.  యుద్ధ ట్యాన్కులు, యుద్ధ శకటాలు, పెద్ద ఎత్తులో మోహరింపు లాంటి పాత పద్దతుల వల్ల (రెండో ప్రంపంచ యుద్ధ  పద్ధతులు) రష్యా  త్వరితగతిన తన గమ్యాన్ని చేరుకోలేకపోతోంది.   

దీనికి, ఉక్రెయిన్ వాడుతున్న  కొత్త యుద్ధ విధానాలే కారణం.  రష్యా ఉక్రెయిన్ రాజధానిని  ఆక్రమించుకోవడానికి సుమారు 40 కిలోమీటర్ల పొడువున ఆయుధ సంపత్తి, సైన్యాన్ని మోహరించింది.  కానీ ఉక్రెయిన్ పది మంది కంటే తక్కువ వున్న చిన్న చిన్న సమూహాలతో, ఒక రకంగా చెప్పాలి అంటే గెరిల్లా పద్దతిలో  భుజం మీద మోసుకొని వెళ్లగలిగే ట్యాన్కు   విధ్వంస క్షిపణులతో అంత పెద్ద కాంవోయిని (పటాలంలను )  చిన్నా  భిన్నం చేసింది.  కోట్ల విలువ చేసే ఒక యుద్ధ ట్యాన్కు ను నాశనం చేయడానికి .. అంతకంటే ఎంతో తక్కువ   విలువ కలిగిన  ఆయుధాలు వాడి ఆ మొత్తం పటాలమును చిన్నాభిన్నం చేసింది.  ఇటువంటి యుద్ధ తంత్రాన్ని అవలంబించిన   రష్యాకు ఆయుధ సంపత్తిని కాపాడుకోలేకపోవడంతో  ఆర్ధిక భారం పెరుగుతోంది. అంతే కాకుండా, అనేకమంది సైనికులను కోల్పోయింది.  . 

అంతే  కాకుండా , ఉక్రెయిన్దా చిన్న పాటి రిమోట్ తో నడపగలిగిన  డ్రోన్ యుద్ధ విమానాలు ద్వారా బాంబులు వెయ్యడం... ద్వారా.. మిలియన్ల విలువ ఉండే రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. దీని వల్ల, ప్రపంచ దేశాలు డ్రోన్ విధానాలను అవలంబించే ఆయుధాలను వాడడం ఎక్కువ అవుతుంది. 

ఈ విషయాన్ని, ఆలస్యంగా తెలుసుకున్న  రష్యా  ఇప్పుడు త్వరిత గతిన ఇరాక్ ద్రోణులను పదులు , వందల సంఖ్యలో తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 

ప్రతి దేశము ఇప్పుడు రక్షణ రాగానికి కేటాయింపులు పెంచి తన ఆయుధ సంపత్తిని పెంచుకోడవడం గురించి ఆలోచిస్తుంది. కాల క్రమేణా ఇది  ఆయుధ పోటీకి ఆజ్యం పోయడానికి సహకరిస్తుంది. . 


అతి వాద  మరియు జాతీయవాద  ధోరనుల అలోచనలున్న  నాయకులకు ప్రొత్సాహం :

ఇంత వరకూ,  ఎక్కువ దేశాల ప్రజలు నాయకులు ప్రజాస్వామ్య, సమానత్వ ఆలోచనులున్న నాయకులను ఎన్నుకోవడానికి ప్రజలు మక్కువ చూపించేవారు. 

ఇక పైన, చాలా దేశాలలో అతివాద మరియు జాత్యాహంకార ధోరణులున్న నాయకులను లేదా జాతీయవాద ఆలోచనలు ఉన్న నాయకులను ఆయా దేశ ప్రజలు ఎన్నుకునే అవకాశం ఎక్కువ అవుతుంది. దీని వల్ల , వలస వాదులు, ఇతర మతాలు, విధానాలను అవలంభించేవారు , వారి నిజాయితీని నిరూపించుకొనే  అవసరం ఎక్కువ అవుతుంది.  రాజకీయనాయకులు మరియు రాజకీయ పార్టీలు కూడా ఉక్రెయిన్లో జరుగుతున్న/జరిగిన పరిణామాలను చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. 

నాయకులు కూడా, తమను తమ రాజకీయ పార్టీ యొక్క విధానాలను దీనికి అనుగుణంగా మార్చుకుంటారు. ఉక్రెయిన్  యుద్ధ పాఠాలని త్వరిత గతిన విశ్లేషించి  చైనా లాంటి దేశాలు తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేసి తైవానును ఆక్రమించేందుకు త్వరితగతిన  చర్యలు చేపట్టే  అవకాశం ఉంది. 

 

ఆహార ధాన్యాలు మరియు నూనెల కొరత :

ఉక్రెయిన్  దేశం యూరోపులో భాగమైనా కానీ,  యుక్రెయిన్ యొక్క తలసరి ఆదాయం యూరోపులోని అన్ని దేశాలతో పోలిస్తే చివరి వరుసలో ఉన్న దేశాలలో ఉంటుంది..  ఇంత బీద దేశమయిన కానీ మన భారతదేశం నుండి వైద్య విద్య చదువుకోవడానికి ఎందుకు వెళ్తున్నారో అని చాలా మంది సందేహం రావొచ్చు... అది సహజమే.. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.. :)

వారి ఎక్కువ వనరులు ముఖ్యంగా  గనులు మరియు , వ్యవసాయం.  ఇక్కడ పండే గోధుమలు వివిధ ఖండాల్లోని దేశాలకు ఎగుమతి  చేయబడుతుంది.  ఎంత అంటే, ఈ దేశాన్ని యూరోప్ యొక్క  "బ్రెడ్-బాస్కెట్" అంటే యూరోప్  యొక్క ధాన్యాగారం అని కూడా అంటారు.  

ఈ యుద్ధం వల్ల ధాన్యాలు , నూనెల మరియు ఖనిజాలకు లోటు ఎక్కువ అవుతుంది. ఇది గమనించిన అభివృద్ధి చెందిన దేశాలు తమకున్న డబ్బు, పరపతి తో మిగితా దేశాల్లోని ధాన్యాన్ని కొనుగోలుకు ప్రయత్నిస్తాయి .  దీని వల్ల  బీద దేశాలకు ధాన్య అవలభ్యత తగ్గుతుంది. బీద దేశాలలో ఆహార కొరతకు దారి తీస్తుంది. 

ఈ యుద్ధం వాళ్ళ  వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరగడం, సాధారణ కుటుంబాలకు వారి జీవన విధానానికి ఆశని పాఠం అయ్యే అవకాశం ఉంది. 


ముగింపు :
మొత్తానికి, ఈ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు  నిశితంగా గమనిస్తున్నాయి.  ఈ యుద్ధం దేశాల భవిష్యత్   ఆర్థిక, సామాజిక, రాజకీయ, రక్షణ  విధానాల మీద ప్రభావం తప్పనిసరిగా చూపిస్తుంది. ఇంతతో కాకుండా దేశాలు తమకు తాము నియంత్రించే గ్ఫ్స్ లాంటి వ్యవస్థ ఆధారిత గైడింగ్ వ్యవస్థను తయారు చేసుకోవడం, నిఘా , రోబోటిక్ ఆయుధాలు, ఎక్కువ మొబిలిటీ  కలిగిన మిస్సైల్ వ్యవస్థలు లాంటివి ఎక్కువ అవుతాయి. 


సర్వే   జనా  సుఖినో భవంతు, లోక సమస్త  సుఖినో భవంతు. 
ఓం శాంతి శాంతి శాంతిహి.  


1 comment:

Anonymous said...

Good information..!!